స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం లేని నాడు, ఆధార జీవనం కొనసాగించేనాడు కాలం వికటించి భర్త నిరాదరణకు గురి అయి ఒక స్త్రీ పడిన అగచాట్లు, సమాజానికి వెలియై, బలియై, నిశీధి ప్రయాణంలో విసిగి వేసారి సన్యసించిన భర్త నీడనే అనాధల సేవకు తన జీవితాన్ని కై౦కర్యం చేసుకున్న ఓ అతివ గాధ ఈ ప్రేమ్ చంద్ "సేవాసదన్".
దిగజార్చిన వ్యవస్థే ఆ స్త్రీ ని అధోగతి పాలు కాకుండా నిలిపి ఉన్నత స్థాయికి చేరుస్తుంది.మంచి చెడు రెండు తోవలను ఈ సమాజమే ఏర్పరుస్తు౦ది. పరిస్థితుల ప్రాభవాన కొన్ని జీవితాలు చెడును ఎన్నుకుంటాయి.పొరలు వీడి మంచి వైపు పయనించే అవకాశం ప్రతి మనుజునికి సమాజం కల్పించినప్పుడే అది సభ్య సమాజం అవుతుంది.
చక్కటి లౌకిక సత్యాలను ఆ కాలం నాటి స్థితిగతులకు , సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా ప్రేమ్ చంద్ నవలనును మలిచారు.పశ్చాతాపమనే చేదు ఫలాలను ఎప్పుడో ఒకప్పుడు అందరూ రుచిచూడవలసిందే" అని నవల మొదలు పెట్టిన మొదటి వాక్యం ప్రేమ్ చంద్ కథావృక్షం యొక్క ముఖ్యమైన వేరుని పెరికి చూపిస్తుంది,నవలా వస్తువుని, కథాసారాన్ని తెలుపుతుంది.
ప్రేమ్ చంద్ కథలలో విలక్షణమైన లక్షణం కథ చివరి ఘట్టం ఎవరు ఊహించని మలుపులు తిరుగుతుంది. పరిస్థితి ఎలాంటిదైనా ఒక నిఘూఢమైన ఆశాభావం ప్రతి కథలోనూ కనిపిస్తుంది. ప్రతి కథా నాయికా తను మానసికంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాన్ని కల్పిస్తాడు ఆ ఎదిగే అవకాశాన్ని అందిపుచుకోవడంలోనే స్త్రీ జాతి యొక్క మహిమాన్వితమైన గొప్ప వ్యక్తిత్వాన్ని పాఠకులు గుర్తించేలా చేస్తాడు.
స్త్రీ యందు దివ్య తేజస్సును , పవిత్రతను చూపిస్తాడు ప్రేమచంద్. అతని పదాలలో "రూపలావణ్యాలకు బదులు పవిత్రత యొక్క జ్యోతిర్ పుంజం కనిపించింది" అంటాడు. ప్రేమ్ చంద్ ఎంతో సహజంగా స్త్రీల లోని దుర్గుణాలను తాము ఎదుర్కునే విపత్కర పరిస్థితులకు, స్త్రీ లలోని సుగుణాలని స్త్రీల వ్యక్తిత్వానికి ఆపాదిస్తాడు.
మెటీర్యలిజం,ఆర్టిఫిష్యల్ లైఫ్ నుంచి శారీరికంగా, సా౦ఘీకంగా
దిగజారినా మానసికంగా ఎదిగి నిజమైన ప్రేమను సంపాదించుకుంటుంది. ఆ ప్రేమకు మానవత్వపు సాన పెట్టి వజ్రమై మెరసి సంఘంలో తను పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి సంపాదించుకుంటుంది నవలానాయిక సుమన్.ఆఖరికి ఒక వినమ్ర పవిత్ర మూర్తిగా మిగిలిపోతుంది.
ఒడిదుడుకులు ప్రతి జీవితానికి సహజమే కాని స్త్రీ జీవితాన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పట్టి కుదిపివేస్తాయి.నేటి ఆధునిక సమాజంలో పరిస్థితులను ఎదుర్కొనలేక అతివల ఆత్మహత్యలను వింటుంటే అలనాడు ప్రేమ్ చంద్ సుమన్ చూపించిన నిబ్బరం నేటి స్త్రీలకి అత్యవసరమైన స్ఫూర్తి అనిపిస్తుంది.
నవల - సేవాసదనం
మూలం - ప్రేమ్ చంద్
సంక్షిప్తానువాదం - కే.వి. రెడ్డి
ప్రచురణ కర్త - పీకాక్ క్లాసిక్స్
నవల - సేవాసదనం
మూలం - ప్రేమ్ చంద్
సంక్షిప్తానువాదం - కే.వి. రెడ్డి
ప్రచురణ కర్త - పీకాక్ క్లాసిక్స్
No comments:
Post a Comment