Sunday 30 October 2011

Rabindranath Tagore "Gora"

              

             " గోరా"విశ్వవిఖ్యాత  గురూజీ  రబీ౦ద్రనాథ్ టాగోర్ వ్రాసిన ప్రఖ్యాతి గాంచిన నవల. గోరా నవల ఇతివృత్తం కథానాయకుడు గోరా, సిపాయి విద్రోహంలో హి౦దూ దంపతులకు  దొరికిన ఐర్లాండ్ దేశీయుడీ శిశువు.అతనిని హైందవ సంప్రదాయంలో అతని గురించి ఎవరికీ తెలియకుండా పెంచుతారు. సంఘం పట్ల బాద్యత విస్మరించినందుకు శిక్ష వేసుకుంటుంది పెంచిన తల్లి. హైందవ పద్ధతులు పాటించకుండా ఒకే ఇంట్లో ఉ౦టూ భర్తకి శారీరికంగా దూరంగా  ప్రత్యేకమైన తన గదిలో  గడుపుతూ ఉంటుంది. 
           
          ఇవేమీ తెలియని గోరా హైందవ సంస్కృతిని బాగుగా జీర్ణి౦చుకుని వేరే మతాలను , ముఖ్యంగా బ్రహ్మ సమాజాన్ని హేయ భావంతో  వీక్షిస్తాడు కాని బ్రహ్మ సమాజానికి చెందిన స్త్రీ  సుచరిత  పట్ల ఆకర్షితుడౌతాడు. అయినా తన హిందూ ధర్మాన్ని వోదులుకొనలేక సంఘర్షణకి లోనౌతాడు. 
        
          ప్రేమ కంటే  విధి బలీయమైనదైనా,  వీరి ప్రణయ  వృత్తా౦తమందు వారి ఇద్దరిని మమేకం చేస్తుంది. గోరా తన పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుంటాడు , హైందవ ధర్మం అతనిని వెలివేస్తుంది దానితో అతను సుచరిత పాణిగ్రహణం చేసి  బ్రహ్మసమాజంలో చేరుతాడు.

           నేటి పరిస్థితులకు కూడా వర్తించే ఎన్నో విషయాలను గోరా నవల వివరిస్తుంది .చక్కటి పద సమూహాలు , సాదృశ్య వర్ణనలను, చక్కటి తార్కిక వాద ప్రతివాదాలతో కూడుకున్న సంభాషణలు కలిగినది ఈ నవల. వ్యక్తుల మానసికావస్థలను,అవసరాలను,సాంఘీక పరిస్థితులను చక్కగా విశ్లేషించారు.
          
             మనోశాస్త్రం , సాహిత్యం , తార్కికం , సామాజిక శాస్త్రం అన్నిటినీ  సమన్వయ పరిచి నిబిడీకృతం చేయబడిన నవల "గోరా. " 

              కేవలం ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులనే కాక సామాజిక మార్పుని , మతాల సంగమాన్ని , సమైక్యతని, ఆర్ధిక పరమార్ధాన్ని, సమ సమాజ జీవనాన్ని  సూచిస్తూ  అలనాడే ఆధునిక  లోపరహిత సమసమాజ  నిర్మాణానికి  పునాది వేసిన నవ యుగ  వైతాళికుడు రబీ౦ద్రనాథ్ టాగోర్. 


 నవల: గోరా
 మూలము: రబీ౦ద్రనాథ్  ఠాకూర్ 
 అనువాదము: శివశంకర స్వామి                           
                                                 

Tuesday 18 October 2011

Premchand "Sevasadan"

                                                              

       స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం  లేని నాడు, ఆధార  జీవనం కొనసాగించేనాడు కాలం వికటించి భర్త నిరాదరణకు గురి అయి ఒక  స్త్రీ  పడిన అగచాట్లు, సమాజానికి వెలియై, బలియై, నిశీధి  ప్రయాణంలో విసిగి వేసారి  సన్యసించిన భర్త నీడనే  అనాధల సేవకు తన జీవితాన్ని కై౦కర్యం చేసుకున్న ఓ అతివ గాధ ఈ ప్రేమ్ చంద్  "సేవాసదన్".


               దిగజార్చిన  వ్యవస్థే  ఆ స్త్రీ ని  అధోగతి పాలు కాకుండా నిలిపి ఉన్నత స్థాయికి చేరుస్తుంది.మంచి చెడు రెండు తోవలను ఈ సమాజమే ఏర్పరుస్తు౦ది. పరిస్థితుల ప్రాభవాన కొన్ని జీవితాలు చెడును ఎన్నుకుంటాయి.పొరలు వీడి మంచి వైపు పయనించే అవకాశం ప్రతి మనుజునికి సమాజం కల్పించినప్పుడే అది సభ్య సమాజం అవుతుంది.


                      క్కటి లౌకిక సత్యాలను ఆ కాలం నాటి స్థితిగతులకు , సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా ప్రేమ్ చంద్ నవలనును మలిచారు.పశ్చాతాపమనే చేదు ఫలాలను ఎప్పుడో ఒకప్పుడు అందరూ రుచిచూడవలసిందే" అని నవల మొదలు పెట్టిన మొదటి వాక్యం ప్రేమ్ చంద్ కథావృక్షం యొక్క  ముఖ్యమైన వేరుని పెరికి చూపిస్తుంది,నవలా  వస్తువుని, కథాసారాన్ని  తెలుపుతుంది.  


           ప్రేమ్ చంద్ కథలలో విలక్షణమైన లక్షణం కథ చివరి ఘట్టం ఎవరు ఊహించని మలుపులు తిరుగుతుంది. పరిస్థితి ఎలాంటిదైనా ఒక నిఘూఢమైన ఆశాభావం ప్రతి కథలోనూ కనిపిస్తుంది. ప్రతి కథా నాయికా తను మానసికంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాన్ని కల్పిస్తాడు ఆ ఎదిగే అవకాశాన్ని అందిపుచుకోవడంలోనే  స్త్రీ జాతి  యొక్క మహిమాన్వితమైన గొప్ప వ్యక్తిత్వాన్ని పాఠకులు గుర్తించేలా చేస్తాడు. 
  

       స్త్రీ యందు దివ్య తేజస్సును , పవిత్రతను చూపిస్తాడు ప్రేమచంద్. అతని పదాలలో "రూపలావణ్యాలకు బదులు పవిత్రత యొక్క జ్యోతిర్ పుంజం కనిపించింది" అంటాడు. ప్రేమ్ చంద్ ఎంతో సహజంగా స్త్రీల లోని దుర్గుణాలను తాము  ఎదుర్కునే విపత్కర పరిస్థితులకు,  స్త్రీ లలోని  సుగుణాలని స్త్రీల  వ్యక్తిత్వానికి ఆపాదిస్తాడు. 
  

                       మెటీర్యలిజం,ఆర్టిఫిష్యల్ లైఫ్ నుంచి శారీరికంగా, సా౦ఘీకంగా 
దిగజారినా మానసికంగా ఎదిగి నిజమైన ప్రేమను సంపాదించుకుంటుంది. ఆ ప్రేమకు మానవత్వపు సాన పెట్టి వజ్రమై మెరసి సంఘంలో తను పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి సంపాదించుకుంటుంది నవలానాయిక సుమన్.ఆఖరికి ఒక  వినమ్ర పవిత్ర మూర్తిగా మిగిలిపోతుంది.


         ఒడిదుడుకులు  ప్రతి జీవితానికి సహజమే కాని స్త్రీ జీవితాన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పట్టి కుదిపివేస్తాయి.నేటి ఆధునిక సమాజంలో పరిస్థితులను ఎదుర్కొనలేక అతివల ఆత్మహత్యలను వింటుంటే అలనాడు ప్రేమ్ చంద్ సుమన్ చూపించిన నిబ్బరం నేటి స్త్రీలకి అత్యవసరమైన స్ఫూర్తి అనిపిస్తుంది.  




నవల - సేవాసదనం
మూలం - ప్రేమ్ చంద్ 
సంక్షిప్తానువాదం - కే.వి. రెడ్డి 
ప్రచురణ కర్త  - పీకాక్   క్లాసిక్స్          

Sunday 16 October 2011

Chalam Premalekhalu

                                                           
                                                 చైతన్య వాహిని

                             చలం వ్రాసిన " ప్రేమలేఖలు" చదువుతుంటే పురుష పుంగవులు ఇలా కూడా స్పందిస్తారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి  పురుషుడు చలం లాగ వ్రాయలేక పోయినా స్పందించగలిగితే ఏ స్త్రీ  జీవితమైనా సార్థకం  అవుతుందని  అనిపిస్తుంది. కాని అన్ని ఇన్ని అని చెప్పనలవి  కానటువంటి ఎన్నెన్నో  విధాలైన  ముసుగులతో  బ్రతికే  మగవారికి  ఇలాంటి  భావాలు  కూడా  తడతాయా అనిపిస్తుంది. చలం  భావాలన్నీ  వెరసి  ప్రేమ  అసలీ  పదమే చాలామందికి నచ్చదు. ఏదో  సినిమాలో కనిపించే  చూపించే  అవాస్తవికత అనిపిస్తుంది . నాకే  ఈ  ఆర్టిస్టిక్  హార్ట్  లేకపోతే ........... అంటాడు  చలం.

                                     ఆర్టిస్టిక్ హార్ట్ అంటే  ఏమిటి ? అనుభూతిని  ఆస్వాదించే  మనసు. ఒక  రకంగా  ఇది  అందరిలోనూ  ఉంటుందంటారు  కొందరు . కాని విచారకమైన  విషయం  ఏమిటంటే  ఆ ఆస్వాదించే  అనుభూతి ఒక రుచికరమైన భోజనం, ఒక పెగ్గ్, ఒక సిగరెట్, అర్థరాత్రి  హడావడి క్షణాలకు పరిమితమౌతుంది. ఈ శరీరాన్ని మించినది  ఒకటి  ఏదైనా అస్సలు   ఉంటుందనే  ధ్యాస  ఎందరికి  ఉంటుందో  మరి. స్త్రీ  శరీరాన్ని వాడుకుని, మెదడు లేదని నిర్ణయించి, మనస్సు స్త్రీకి  ఉన్న నిర్భలత్వమని  చాటిచెప్పే పురుష పుంగవుల మధ్య  చలం  లాంటి  వారు  ఉంటారంటే 
 విచిత్రమనిపిస్తుంది.  

                          చలం  రచనలలో   ఎన్నెన్నో  సున్నిత లలిత  భావాలు. పురుషుడు ఇంత సున్నితంగా, నిశితంగా స్త్రీ హృదయాన్ని  చదవగలడా? స్పంది౦చగలడా?   చలం  స్త్రీ పట్ల నవరసాల వెల్లువై ఆమె  హృదయాన్ని నిలువునా  ముంచెత్త గలిగాడు. అతని భావాలలో  స్త్రీ  పట్ల నవవిధా భక్తి , అపారమైన గౌరవభావం  వెల్లివిరుస్తాయి. ప్రతి స్త్రీ  అలాంటి ఆరాధకున్ని         మెచ్చుకునేటంతగా తన భావాలకి సున్నితత్వాన్ని  అలంకరించాడు.    

                           ఆదర్శమైన ప్రేమలో వ్యక్తిత్వమే  నశించాలి  నేను, నువ్వు అన్న భావమే అదృశ్యం కావాలి అంటాడు చలం. అంతటి ప్రేమ కట్నాలకు,  బేరసారాలకు, ఒప్పు తప్పులకు పరిమితమై, అందచందాలతో బేరీజు వేయబడి కులగోత్రాల సమక్షంలో జరిగే పెళ్లి ద్వారా మొదలవుతుందా,అసలు జీవితాంతం ఆ జంటలు  అటువంటి  అనుభూతికి  లోనవుతారా  అనే              సంశయం  కలుగుతుంది.                  
                       
                               అసలు   చలంలాంటి  వాళ్ళను నేటి మనోశాస్త్రం అపసామాన్యుల  క్రింద జమకడుతుందేమో కాని ఆడవాళ్ళు మాత్రం అతనిని తప్పక గౌరవిస్తారనే  భావి౦చుదా౦.                                          


 చలం: ప్రేమ లేఖలు