సముద్రం
పాపినేని శివశంకర్
2007
ఒక కథ ఒక నవల కేవలం నిడివి మాత్రమే కాదు భారంలో హృదయపు అంచుల్ని తాకే విధానంలోకూడా ఎన్నో తేడాలు.ఇది ఒక కథ కానీ నవలను మించిన గాఢత పరిపూర్ణత మనకి ఈ కథలో కనిపిస్తాయి . అధ్యాపక వృత్తిలో ఒదిగి పోయి పుస్తక పఠనంలో ఇమిడిపోయిన పుస్తక ప్రేమి విజ్ఞాన ఘని. ఈ కథానాయకుడు అతని జీవిత ఆఖరి క్షణాలలో తన స్నేహితుని అడిగిన ప్రశ్న "సముద్రాన్నిఎక్కడ పారబోయాలి" తో కథ మొదలు అవుతుంది . ఆ స్నేహితుడు వివరించిన అతని జీవితమే ఈ కథ "సముద్రం "
కథా వివరణలో ఒక వైవిధ్యం ఉంది . ఒక అల్జీమర్స్ పేషెంట్ తన గతమంతా గుర్తుచేయమని అడిగితే, అతని జ్ఞాపకాలని తన జ్ఞాపకాల సహకారంతో తూచి గత సంఘటనల ద్వారా నాయకుడికి వివరించే వైనం వినూత్నంగా ఉంటుంది.
అందరూ నాయకుని పుస్తకాల పురుగు అంటే కథకుడు పుస్తకప్రేమిని "పుస్తక మాలి " అని పిలవడం సాహిత్యాన్ని ఆరాధించే స్నేహితుల్ని గౌరవించే మంచి స్నేహం కనిపిస్తుంది.
నీ ద్వారానే నాకు శ్రీ శ్రీ , చలం, తిలక్ పరిచయం నీ వల్లే నేను సమాజాన్ని హేతుబద్దకంగా చూడడం నేర్చుకున్నాను అంటాడు కథకుడు.
" విజ్ఞానానికి విలువున్న రోజులవి " అవును ఆ రోజులలో బ్రతికిన వాళ్ళకి ముఖ్య0గా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకి ఈ కథ వాస్తవంగాను వారి జీవితాలకి చేరువగాను అనిపిస్తుంది.
ఉత్తరాల అందం ఆసాంతం మరిచిపోయిన ఈ రోజుల్లో ఉత్తరాలు రాసుకునే ఆ రోజుల్లో ఉత్తరాలలో " నీ అక్షరాలు స్ఫుటంగా నీ మనస్సు అర్థంచేసుకుని కాగితం మీద కుదురుగా కూర్చున్నట్లనిపించేది తొణుకు బెణుకు లేకుండా అచ్చంగా నీ మనస్సు మల్లేనే " అంటాడు కథకుడు తన స్నేహితుడు పుస్తకమాలి తనకి వ్రాసిన ఉత్తరాల గురించి.
ఒక కాగితం కొన్ని అక్షరాల అమరిక కొన్ని భావనలు స్పందనలు అన్నీ వెరసి ఒక ఉత్తరం. కానీ ఉత్తర ప్రత్యుత్తరాలకి ఎంత అందం అద్దింది రచయిత భావ వ్యక్తీకరణ -- స్పందించే హృదయానికి మళ్లీ ఎవరికో ఒక అందమైన ఉత్తరం వ్రాయాలనిపించేటంతగా ఒకే ఒక్క వాక్యంతో ప్రేరేపించగలిగాడు రచయిత .
మన తెలుగులో ఇంత చక్కటి భావజాలం మాయమైపోయిందనే అనుకోవాలి . కనీసం ఇంతటి అందంతో ఈ స్థాయి లో సాహిత్యం ఉంటుందని తరువాత తరాలకి తెలిపే నాథుడు లేరు తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు లేకపోవడం తెలుగు సాహితీ రంగానికి ఓ విషాదమే .
ఒక అధ్యాపకుడు ఎలా బోధిస్తే తన విద్యార్థులను ఆకట్టుకుంటాడో తన పాత్ర ద్వారా విశదీకరించి " సమాచారం గాక వాళ్లలో సృజనాత్మకతను పెంచటమే నీ ఆశయం " అంటాడు కథకుడు. నీకు మల్లె బోధనా రంగం లో గాకుండా ----- రంగం లో స్థిరపడినందుకు విచారం కలిగేది అని తన అసంతృప్తిని పుస్తక మాలి బోధనా వృత్తిపట్ల తనలో రేకే త్తి0చిన inspiration ని చాటుకుంటాడు.
" ఉద్యోగంతోనో పెళ్ళితోనో చాలా మంది విస్తరణ ఆగిపోతుంది కానీ నిన్ను నువ్వు పుస్తకాల పుటల్లో విస్తరించుకున్నావు "
అంటూ జీవితం లో ఒక సంఘటన కారణంగా ఘనీభవించకూడదు కలకాలం వృత్తి తో బాటు ప్రవృత్తి కూడా నిరంతర ప్రవాహం లా పారుతుండాలి అని రచయిత ఉద్బోధ చేసి నట్లు మనకి అనిపిస్తుంది .
"మారుతున్న కాలాన్ని మారుతూ నువ్వు అవగాహన చేసుకున్న తీరు వాటిల్లో కనిపించేది" అంటాడు కథకుడు. పదాల కూర్పు రెండు మూడు సార్లు చదివితే పద అమరిక అందం తెలుస్తుంది.
" చిన్న తనములోనే తల్లి దండ్రులు పోవటం వల్ల కలిగిన ఒంటరితనం పుస్తక పఠనంలో మరుగు పడిందేమో " కథానాయకుని మానసిక స్థితిని ఒక మనోవైజ్ఞానికుని వలే విశ్లేషిస్తాడు రచయిత .
వెలకట్టలేని పుస్తకాల గురించి మాట్లాడుకున్నామని చెబుతూ ఎన్నో విలువైన పుస్తకాల పేర్లని దేశ విదేశ గొప్ప రచయితల పేర్లని ఉదాహరణగా పేర్కొంటాడు
ఈ కథకుడు.
"నీ మాటల్లో మళ్ళీ బ్రతికారు "
ఆ రోజుల్లోనే మళ్ళి బ్రతికారు అని అంటే ఈ రోజుల్లో వాళ్ళు కనుమరుగై ఆవిరై అస్తిత్వమే లేని వ్యక్తిత్వాలని మనకి వారి ఉనికిని పరిచయం చేస్తున్న రచయిత బహుశా సాహిత్యానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్లుగా భవిష్యత్తుని ఆలోకించినట్లుగా అనిపిస్తుంది.
"ఆ సాయంత్రం నేను నిజంగా జీవించిన రోజుల్లో ఒకటి " జీవించడం అంటే
ఎలా ఉంటుందో రుచి చూపించాడు రచయిత . పుస్తక పఠనానికి ఊపిరి పోసింది
ఈ కథ.
contd....