ఆర్ . వసుంధరా దేవి "ఓ పెళ్లి కథ "
ఫిబ్రవరి 1977 విజయ మాస పత్రికలో వచ్చిన వసుంధరదేవి గారు రచించిన అనుబంధ నవల " ఓ పెళ్లి కథ ". ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయి డిగ్రీ చదువుకుని పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి వ్యక్తిత్వం నచ్చి పెళ్లిచేసుకుంటుంది . కానీ సాధారణంగా జరిగిపోయే కాలంతో ఏకీభవించలేక ఏ వ్యక్తిత్వానికైతే పెద్ద పీట వేసిందో ఆ వ్యక్తిత్వంలో తన పై ప్రేమ లేదనే అపోహనే రూఢీగా నమ్మి భర్తకి దూరంగా తన జీవితాన్ని సాగించడం మొదలుపెడుతుంది. కానీ ఎందరో అమ్మాయిలు ప్రేమ , పెళ్లి బంధాలలో ఇముడుతూ అంతకు మించి విలువైన తమ ఆశయాల వైపు పయనించడం గమనిస్తుంది.
నాకు పెళ్ళైతే "పెళ్లి , నేను నా భర్త నా పిల్లలు " నా జీవితంలో భాగం మాత్రమే అంతే కానీ పెళ్లితో నా గమ్యాన్ని నేను వదులుకోను అంటుంది తన డాక్టర్ చదువుతున్న చెల్లెలు . నీకు నీ లక్ష్యం నీ భర్త ప్రేమ మాత్రమే అవడం వల్ల, అతను నీ పట్ల చూపే బాధ్యత కన్నా అతని గతంలోని స్త్రీ పట్ల అతనికి ఉండిన ప్రేమని ఎక్కువగా తూకం వేసుకుని నీ జీవితంలో వెలితిని నింపుకున్నావంటుంది తన స్నేహితురాలు.
కథా నాయిక స్వగతంలో తన ఆలోచనలని, ప్రవర్తనని, మనస్తత్వాన్ని, పరిస్థితులని, గతాన్ని, విశ్లేషించుకోవడం కథకు చక్కటి మనో విశ్లేషణను అందించింది . రచయిత్రి ఈ కథలో సాంఘీక మరియు మానసిక విశ్లేషణను అద్భుతంగా ఒక మానసిక నిపుణురాలిలా చాలా సున్నితంగా మనస్సుకి హత్తుకునేలా కొనసాగించారు.
తమకి అన్నీ ఉన్నా ఏ లోటు లేకపోయినా ఒక ఉద్దేశ్యం (purpose ) లేని జీవితం వల్ల సంఘర్షణకి లోనైయే వారి గురించి ముఖ్యంగా గృహిణుల గురించి చాలా చక్కగా చిత్రీకరించింది ఈ కథ. ఆఖరికి మన కథా నాయిక చిన్నప్పటి అనుభవాల వల్ల తనకి ఏమి కావాలో కూడా నిర్ణయించుకోలేని సందిగ్ద పరిస్థితిని ఆత్మనూన్యతను ఎదుర్కొని వాటితో మౌనంగా వివేచనతో పోరాడుతుంది.
తన భర్త తో తన కున్న బంధం అన్నిటికన్నా విలువైనదనీ , దాని విలువను అతని గతం లోని కొన్ని సంవత్సరాల కాలంతో పెనవేసి బేరీజు వేసి తనని తాను దిగజార్చుకోవడం అనవసరం అని తెలుసుకుంటుంది.
కేవలం జాలి వల్ల తనని పెళ్లిచేసుకున్నాడని మదనపడి భర్తకి దూరంగా వెళ్లిన మన కథా నాయకి అతని పై తనకి కలిగిన జాలితోనే దగ్గర అవుతుంది . జాలి కూడా ప్రేమలో భాగమే అని,అతని పట్ల తన కున్న ప్రేమనుండే అది ఉద్భవించినదని గుర్తిస్తుంది .
చిన్ననాటి ఒక్కొక్క అనుభవం సమాజంలోని వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపుతుందో మనిషిని ఎంత మానసిక సంఘర్షణకి లోను చేస్తుందో ఈ కథ తేటతెల్లం చేస్తుంది.
ప్రతి అనాలోచనపు మాట పసి మనసులపై రాసే రాతి రాతగా మారి వాళ్ళ తలరాతను మారుస్తాయని ఈ నవల తల్లిదండ్రులకు , బంధువులకు , ఉపాధ్యాయులకు, స్నేహితులకు తెలుపకనే తెలుపుతుంది.
ఈ కథలో నాకు నచ్చిన కొన్ని విషయాలను , నాయకి స్వగతాలను , సంభాషణలను "సాదృశ్య వీచికలు" అనే నా మరోబ్లాగ్లో పొందుపరుచుకున్నాను.
నవల : ఓ పెళ్లి కథ
రచయిత్రి : ఆర్ . వసుంధరా దేవి
No comments:
Post a Comment